Wednesday, July 6, 2011

తొలి ఏకాదశి - చాతుర్మాస్య వ్రతం - ప్రాముఖ్యత

             "తొలి ఏకాదశి", ఆషాఢమాసం లో వచ్చే ఈ పండుగ చాలా పవిత్రమైనది. ఆషాఢమాసం శుద్ధ ఏకాదశి నాడు ఈ పండుగను జరుపుకుంటారు. దీనినే "విష్ణు శయన ఏకాదశి" అని, "శయనైకాదశి" అని కూడా పిలుస్తారు. ఈ రోజు శ్రీ మహా విష్ణువు యోగ నిద్ర లోకి వెళ్తాడు కనుకనే దీనికి ఆ పేర్లు వచ్చినవి. అలా యోగ నిద్ర లోకి వెళ్ళిన శ్రీ మహా విష్ణువు తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. కనుకనే ఈ ఏకాదశి ని "విష్ణు ఉత్థాన ఏకాదశి" అంటారు. ఈ ఆషాఢమాసంలోనే తొలకరి వస్తుంది కాబట్టి ఈ ఏకాదశి కి "తొలి ఏకాదశి" అనే పేరు వచ్చింది.
           సంవత్సరంలో వచ్చే అతి ముఖ్యమైన ఎకదశులలో ఇది ఒకటి.  శంఖ,చక్ర,గదా,పద్మాలు ధరించి;లక్ష్మీదేవి పాదములు ఒత్తుచూ,ఆది శేషునిపై శయనించి ఉన్న విష్ణు ప్రతిమను పూజించాలి. ఈ ఏకాదశి వ్రతాన్ని 3 రోజులు చేయాలి.ఏకాదశి ఉపవాసం,ద్వాదశి పారణ ,త్రయోదశి రోజున స్వామి ప్రీతికై గాన,నృత్యాదులతో  శేషశాయిని పూజించాలి.
          ఇక ఈ పండుగ నాడే అతి ప్రాధాన్యమైన "చాతుర్మాస్య వ్రతం"  మొదలవుతుంది. ఈ వ్రతాన్ని గృహస్థులు నాలుగు నెలల పాటు ఆచరించవలసి ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఆషాఢ మాసం లో మొదలైన ఈ వ్రతం శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం వరకు కొనసాగుతుంది. ఒక్కో నెలలో ఒక్కొక్క విధమైన నియమాలతో ఉపవాస దీక్షను ఆచరించ వలసి ఉంటుంది.

వ్రత సంకల్ప విధానం: ఈ చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించే వాళ్ళు 

          "త్వయి సుప్తే జగన్నాథ,జగత్సుప్తం భవేదిదం|
          విబుద్ధేచ విభుద్యేత,ప్రసన్నో మే భవాచ్యుత||
          చతురో వార్శికాన్ మాసాన్ దేవస్యోత్థాపన వధి|
          శ్రావణే వర్జయేత్ శాకం దధి భాద్రపదే తథా||
          దుగ్ధమాశ్వయుజే మాసి  కార్తికే ద్విదళం త్యజేత్|
          ఇమం కరిష్యే నియమం నిర్విఘ్నం కురుమేచ్యుత||
          ఇదం వ్రతం మయాదేవ!గృహీతం పురతస్తవ|
          నిర్విఘ్నం సిద్ధి మాయాతు ప్రసాదాత్తే రమాపతే||
          గృహీతేస్మిన్ వ్రతే దేవ పంచత్వం యదిమే భవేత్|
          తదా భవతు సంపూర్ణం ప్రసాదాత్తే జనార్దన||"         

    అనే శ్లోకాలను  పఠించాలి.
       భావం: ఈ చాతుర్మాస్యాలలో శ్రావణంలో శాకాన్ని(కూర,దుంప,పళ్ళు,ఆకులు)వదులుతున్నాను,భాద్రపదంలో పెరుగును,ఆశ్వయుజంలో పాలను,కార్తికంలో ద్విదళ ధాన్యాన్ని(రెండు బద్దలుగా వచ్చే పెసలు మొదలైన  గింజలు) విసర్జిస్తున్నాను.ఈ వ్రతాన్ని నిర్విఘ్నంగా ఆచరించేలా అనుగ్రహించు.ఒకవేళ వ్రతం మధ్యలో మరణం సంభవిస్తే వ్రత సంపూర్ణ సిద్ధిని అనుగ్రహించమని" ప్రార్థించి స్వామికి శుద్ధమైన జలంతో అర్ఘ్యం ఇవ్వాలి.
                  ఈ వ్రతం చేయటం వాళ్ళ ఆ సంవత్సరంలో చేసిన పాపాలన్నీ నశిస్తాయి. అంతేగాక దారిద్ర్య బాధలు తొలగడానికి తప్పక ఈ వ్రతాన్ని ఆచరించాలి అని ధర్మ శాస్త్రాల వచనం.

No comments:

Post a Comment